రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. కోర్టులు మొట్టికాయలు వేసినా ఆయన బుద్ధిమారడం లేదని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలకు ఇళ్లు నిర్మించి తీరుతామని నాగార్జున చెప్పారు.
ఇదిలా ఉంటే, ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్లు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. అంతకుముందు అమరావతిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. జులై 24న పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా.. ఈ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.