మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా సత్యనాదేళ్ల

మైక్రో సాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా సత్య నాదేళ్లకు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన ఈ సంస్థకు సీఈవోగా పని చేస్తున్నారు. 2014 నుంచి సీఈవోగా సత్యనాదేళ్ల ఎంపికయి అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా అప్పట్లో నియామకమయ్యారు. తాజాగా సత్యనాదేళ్లను మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ వెల్లడించింది.

ఇక సత్యనాదేళ్ల మైక్రో సాఫ్ట్‌లో అంచలంచెలుగా ఎదిగారు. 2014 ఏప్రిల్ 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియామకమయ్యారు. 2014కు ముందు సత్యనాదేళ్ల మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1976 నుంచి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. తాజాగా చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం.