ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 85 మందితో వెళుతున్న వైమానిక దళం విమానం సి-130 ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉండగా.. మిగత వారు సైనికులు అని సమాచారం. జోలో ద్వీపం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతిచెందినట్లు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 40 మంది జవాన్లను రక్షించినట్లు సొబెజనా పేర్కొన్నారు.
మిగత వారిని కాపాడేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సులు ప్రానిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వేను చేరుకోవడంలో ఫ్లైట్ విఫలమవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు. విమానంలో ఉన్నవారంతా ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లని సమాచారం అందుతోంది. అంతేకాదు… ఈ ఘటన జరిగిన చోట ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ. అయితే… ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.