రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. తిరుపతిలో పర్యటించిన ఆయన రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవడం లేదని.. కాకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కంపెనీలను విస్తరిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి 40 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో రాష్ట్రంలో 4 పోర్టులు ఉండేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 హార్బర్ల నిర్మాణాన్ని చేస్తున్నట్టు తెలిపారు. రూ. 3,500 కోట్లతో ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.