శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజధానులు : మంత్రి ధర్మాన

-

ఏపీ రాజధాని అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు చేపట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడతాయని, అందుకే మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. 1956లో జరిగిన భూ సర్వే తర్వాత ఇంతవరకు సర్వేలు చేయలేదని, సర్వే జరగనందువల్ల గ్రామాల్లో గొడవలకు దారి తీస్తుందన్నారు.

మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ అమలు చేస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం విస్తృత ప్రయోజనాలతో కూడుకున్నదని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ నాటికల్లా సర్వేలు పూర్తి చేస్తామని, అనుభవం ఉన్న సిబ్బందిని నియమించామని మంత్రి ధర్మాన తెలిపారు. అత్యాధునిక డ్రోన్‌లు ద్వారా సర్వేలు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో నేటికీ 21 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. ఓట్లు కోసం సర్వే చేయటంలేదని.. ప్రజా ప్రయోజనాల కోసమే చేస్తున్నామని చెప్పారు. ఎల్‌కేజీ నుంచి ఉన్నత విద్య వరకు మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news