అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్నారు. అందుకే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్‌కాండ్లీ గ్రామంలోని రూ.20 లక్షలతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు .
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని, బీఆర్‌ఎస్ సర్కారే కొలువుదీరుతుందని అన్నారు ఆయన. ప్రాంతీయ పార్టీల ఉనికిని కొల్లగొట్టేందుకే కేంద్రం కావాలని జమిలి ఎన్నికల అంశం తెరమీదికి తెచ్చిందని ఆయన మండిపడ్డారు . తెలంగాణలో నవంబర్, డిసెంబరు మాసాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా జమిలిపై ప్రజలు ఆలోచించే పరిస్థితిలో లేరని వెల్లడించారు. బీజేపీ ఓడిపోతోందన్న భయంతోనే జమిలి పేరిట ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని వ్యక్తపరిచారు మంత్రి ఇంద్రకరణ్.