సీఎం కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మొదట గా పాత ఎస్పీ కార్యాలయం ఆవరణలో రూ. 50 కోట్లతో నిర్మించనున్న క్రీడా పాఠశాల, అంతర్జాతీయ స్థాయి ఆధునిక స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాలుగో వార్డులో కాసింపేట వద్ద ఎస్సారెస్పీ కాలువపై రైతులకు ఉపయోగపడే విధంగా బ్రిడ్జి నిర్మానానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఎద్దుల చెరువు ట్యాంక్బండ్ సమీపంలో 80 లక్షల వ్యయం తో నిర్మించిన కుమ్మరి సంక్షేమ భవన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ఆదరణకు నోచుకొని కులవృత్తులకు సీఎం కేసీఆర్ మళ్లీ జీవం పోశారన్నారు. సూర్యాపేటలో కులమతాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందని, ఒకవైపు జిల్లా అభివృద్ధి మరోవైపు కులసంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, ఆత్మగౌరవానికి ప్రతీకగా కులసంఘాల భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు.
సూర్యాపేట లోని మహా ప్రస్థానం శనివారం నుంచి అందుబాటులోకి వస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.. 4.20 కోట్ల తో మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాప్రస్థానంలో కాటికాపరులతో సమావేశం అయిన మంత్రి, అంత్యక్రియల ఫీజును రూ.6 వేలుగా నిర్ణయించారు.ఈ ఫీజు రాష్ట్రం లోనే అతి తక్కువగా ఉందన్నారు. పెన్ పహాడ్, వెలుగు : మండలంలోని చీదెళ్ల గ్రామంలో బస్ షెల్టర్, రూ.9.70 కోట్లతో నిర్మించే గౌడాన్ నిర్మాణానికి, పెద్దగట్టుపై కొలువైన లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ. 50 లక్షలతో చేపట్టే పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గత పాలకుల హయాంలో ఏనాడు పెద్దగట్టు ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు.