హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం.. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..!

హైదరాబాద్: పీవీ మార్గ్ అంబేద్కర్ నగర్‌లో జీహెచ్ఎంసీ నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను మంత్రులు కేటీఆర్, తలసాని ప్రారంభించారు. ఇళ్ల పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ నెల 28 , జులై 1, 5 వ తేదీల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న కేసీఆర్ ఆశయం సాకారం అవుతోందన్నారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సీఎం ఆశీస్సులతో హైదరాబాద్ మహానగరంలో రూ.9 వేల కోట్ల పైచిలుకు నిధులతో పేదవారి కోసం ఇళ్లు కడుతున్నామని తెలిపారు. హరిత హారంతో రాష్ట్రంలో పచ్చదనం 5 శాతం పెరిందని చెప్పారు.

మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. పేదలకు కట్టించి ఇస్తున్న ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోటిపది లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. పండగ వాతావరణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించుకున్నామని చెప్పారు.