కేంద్ర ప్ర‌భుత్వానికి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

-

చేనేత,  టెక్స్టైల్ పరిశ్రమ పైన కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని లేఖ‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి కేటీఆర్‌. ఇప్పటికే టెక్స్టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు సంవత్సరాలుగా కరోనా సంక్షోభం వలన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను 5 శాతం నుంచి 12 శాతానికి  పెంచడం ఆ పరిశ్రమను చావుదెబ్బ కొడుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

దేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించే టెక్స్టైల్ మరియు చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సిన సందర్భంలో.. ఇలాంటి నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఏనాడు కూడా చేనేత ఉత్పత్తుల పైన పన్ను లేదని అయితే కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారా తొలిసారి 5 శాతం పన్ను విధించిందని, అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా మరో ఏడు శాతం అదనపు GST ని వేయడం వలన చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ అద్భుతమైన చేనేత సాంప్రదాయం ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని  ఈ రంగంలో ఉన్న నేతన్నలు GST పెంపు పైన తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.   ఇప్పటికే చేనేత రంగంలో ఉన్న లాభదాయకత 5 శాతం కంటే తక్కువగా ఉన్నదని ఇలాంటి నేపథ్యంలో అకస్మాత్తుగా 7శాతం టాక్స్ ని పెంచడం వలన ఆ రంగంలోని నేతన్నలు పూర్తిగా నష్టాలపాలయ్యే అవకాశం ఉందన్నారు. సాంప్రదాయ చేనేత రంగం టెక్స్టైల్ ఉత్పత్తుల నుంచి భారీ పోటీ ఎదుర్కొంటుంన్నందున, సంక్లిష్టమైన మల్టీ స్టేజ్ ప్రొడక్షన్ వలన చేనేత ఉత్పత్తులకు అధిక అమ్మకపు ధర ఉంటుందని తద్వారా వాటికి క్రమంగా డిమాండ్ తగ్గుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news