ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం కావస్తున్నా ఇప్పటికీ జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. కాగా ఇటీవలే ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువతరం అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ 80 ఏళ్ల వృద్ధురాలు మాత్రం ఎంతో కష్టపడుతూ వచ్చి పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ భయంతో ఇంటికి పరిమితం అయిన సదరు వృద్ధురాలు లాక్ డౌన్ తర్వాత తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయటకి వచ్చింది. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంది.. ఈ ఘటనకు సంబంధించి ఓ యువతి విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం ఎంతో మంది యువతకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు… ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.