తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదని మంత్రి రోజా అన్నారు. ‘లోకేశ్తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్య నారాయణ అరెస్ట్ను ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా’ అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే బండారు కుటుంబం, టిడిపి ఖండించకుండా ఆయనకు మద్దతు ఇస్తోందని మండిపడ్డారు.
సీఎం జగన్, మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణ ఇంటిని ఆదివారం రాత్రే చుట్టుముట్టిన గుంటూరు పోలీసులు..అరెస్టు చేసి సోమవారం రాత్రి గుంటూరుకు తరలించారు. విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారని ఒక కేసు నమోదు కాగా, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి.. గుంటూరులోని అరండల్‌పేట, నగరపాలెంలో పీఎస్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అరెస్టు తర్వాత బండారు సత్యనారాయణను గుంటూరు నగరపాలెం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.