పదో తరగతి పరీక్షలకు కూడా లీకుల బెడద తప్పడం లేదు. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తెలుగు క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటన మరవక ముందే ఇవాళ హిందీ ప్రశ్నాపత్రం కూడా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవ్వడం సంచలనం సృష్టించింది. వరంగల్‌లో హిందీ పేపర్ వాట్సాపుల్లో ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వరుసగా రెండో రోజు కూడా లీక్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నాయి.
హిందీ పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై అధికారలను ఆరా తీశారు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని వివరించారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఉప్పల్ పదో తరగతి పరీక్షా కేంద్రం నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఉప్పల్ పరీక్షా కేంద్రంలో సిబ్బందిని సీఐ, తహసీల్దార్ విచారిస్తున్నారు. తమ కేంద్రం నుంచి పేపర్ బయటకు వెళ్లలేదని అధికారులకు సిబ్బంది తెలిపినట్లు తెలుస్తోంది.