సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం జగన్ పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్ చేసారు. వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైసీపీ నేత జగన్ రెడ్డి వ్యవహారశైలి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు.
బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వం కాదా.. మీరు గతంలో కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితుల్ని చక్కదిద్ది ఇవాళ సంక్రమంగా మందుల్ని సరఫరా చేసి పేదల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేనందునే ప్రజలు దారుణంగా తిరస్కరించాక కూడా మీకు బుద్ధి రాలేదు. అసత్య ప్రచారాలు మాని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చారో ఆత్మ విమర్శ చేసుకోండి. ఇప్పటికైనా భాద్యతాయుతంగా నడుచుకోండి అని మంత్రి సత్యకుమార్ వైసీపీకి సూచించారు.