హైదరాబాద్: బల్కంపేట అమ్మవారి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. తాజాగా అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జులై 13న అమ్మవారి కల్యాణం, 14న రథోత్సవ కార్యకమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి వేడుకల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. అమ్మవారి కల్యాణ మహోత్సం, రథోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయానికి వచ్చేలా చర్యలు చేపతామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో రాజకీయాలకు అతీతంగా బల్కంపేట్ ఎల్లమ్మ వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బోనాలు , కల్యాణం ఇతర పండుగలు మన సంస్కృతిని చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కల్యాణ మహోత్సవానికి 80 వేలకు పైగా భక్తులు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణం ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని తలసాని పేర్కొన్నారు.