న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని హెచ్చరించారు.
పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పారు. ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్స్ తెరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించినప్పుడు.. వైరస్ చాలావరకు తగ్గిపోయినప్పుడు మాత్రమే స్కూల్స్ తెరవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్ విజృంభించిన సందర్భాలున్నాయని వీకే పాల్ గుర్తు చేశారు. ప్రస్తుతం వైరస్ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమేనని చెప్పారు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉందన్నారు. రెండు మూడు మంత్రిత్వశాఖలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలని పాల్ సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశం ఉండదని స్పష్టంచేశారు. వ్యాక్సినేషన్ పెరుగుతున్నకొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకూ అందరూ కట్టుదిట్టమైన నిబంధనలను పాటించాలని కోరారు. మరో 5-6 నెలలు ప్రజలు,ప్రభుత్వం కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ పిలుపు నిచ్చారు.