వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో ఎలా ఉన్నప్పటికీ .. ప్రతిపక్షానికి ఆయుధాలు అందించారనే వ్యాఖ్యలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు సంక్షేమ పథకాలు, మరో వైపు రాజకీయ వ్యూహంతో ప్రభుత్వం పరుగులు పెడుతోంది. నిజానికి ఏ ప్రభుత్వమైనా ఇలానే ముందుకు సాగుతుంది. గతంలో చంద్రబాబు కూడా ఒకవైపు పాలనను చూస్తూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకున్నారు. ఈ విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయనేది వాస్తవం. అయితే, ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో గత ఎన్నికల్లో అందరూ చూశారు.
దీంతో ఈ విధానానికి భిన్నంగా సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓటు బ్యాంకును సమూలంగా ప్రక్షాళన చేయ డం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా రాజకీయాల్లో భాగమే. దీనిని వేరుగా చూసేందు కు అవకాశం లేదు. కత్తి అందరి చేతిలోనూ ఉన్నప్పటికీ.. వాడే విధానంలో తేడా ఉన్నట్టుగానే.. జగన్ కూడా తనదైన శైలిలో రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే..ఏపీలో పొత్తుల రాజకీయం పొడిస్తే.. అధికారం అందే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. పైగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇప్పటికే పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జగన్ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జిల్లాల విభజన అనే అంశాన్ని తీసుకున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందుగానే ఈ విషయాన్ని ఆయన ప్రతిపాదించారు. తాను అధికారంలోకి వస్తే.. ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ.. ఓ జిల్లా చేస్తానన్నారు. దీనిపై ఇప్పటికే సమగ్ర సమాచారం తెప్పించుకున్నారు. అయితే, 2021లో జనాభా గణన ఉన్న నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు దీనిని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇంతలో ధర్మాన ప్రసాదరావు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా శ్రీకాకుళాన్ని విభజించేందుకు అవకాశం లేదని, దీనిని విభజిస్తే.. 80 ఏళ్ల దిగువకు వెళ్లిపోతుందని, ఇప్పటికే అభివృద్ధి చెందినవన్నీ కూడా విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వెళ్లిపోతాయని విమర్శలు సంధించారు.
దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. అయితే, ఆయనకు మంత్రి పదవి దక్కలేదనే అక్కసుతోనే ఇలా వ్యాఖ్యా నించారనే విశ్లేషణలతో పాటు.. జిల్లాపై ఆధిపత్యం పోతుందనే ఉద్దేశంతోనూ ఆయన ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన కూ డా వినిపిస్తోంది. ఏదేమైనా.. ధర్మాన మనసులో ఒకటి.. బయటకు మరొకటి.. చేస్తున్నారని, ఇలాంటి నాయకులు ఇలా వ్యవహరించడం వల్ల పార్టీ అసలు ఉద్దేశం చెడిపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ధర్మాన ఊరుకుంటారో.. మరింత రెచ్చిపోతారో చూడాలి.