వైసీపీలో జెడ్పీ టికెట్ పోరు.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ బోళెం..!

-

ఏపీలో గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఇప్పుడు జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక లు మించిపోయాయ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్థానికంలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీలు గెలుపు గుర్రం ఎక్కి మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకునేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఇది ఒక భాగం అయితే, మ‌రోప‌క్క‌, అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోను కూడా టికెట్ల కోసం నేత‌ల మ‌ధ్య తీవ్ర ఫైట్ సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఈ పోరు తీవ్ర‌స్థాయికి చేరుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం జ‌డ్పీటీసీ టికెట్ కోసం అటు ఎమ్మెల్యే, ఇటు మ‌రో కీల‌క నేత ప‌ట్టుబ‌ట్ట‌డంతో వివాదంగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. న‌ర్సీపట్నం జడ్పీటీసీ టిక్కెట్ విషయంలో వేములపూడి గ్రామానికి చెందిన గుడివాడ లోవరాజు సతీమణి రమణమ్మకు, ఎమ్మెల్యే గణేష్  బీఫారం అందజేశారు. అయితే అదే గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు బోళెం నరసింహమూర్తి తన సతీమణి లక్ష్మీకుమారిని జ‌డ్పీటీసీగా చూడాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీ ఫారం కోసం ప్ర‌య‌త్నించారు. అయితే, అప్ప‌టికి అంద‌క‌పోవ‌డంతో ఆయ‌న వైసీపీ అభ్యర్థినిగా త‌న‌భార్య‌త‌లో జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయించారు. వాస్తవానికి వేములపూడిలోని రెండు ఎంపీటీసీ స్థానాలను నరసింహమూర్తి వర్గీయులకు కేటాయించారు.

కానీ తమకు జడ్పీటీసీ టిక్కెట్‌ లేదా ఎంపీపీ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు రమణమ్మకు జడ్పీటీసీ టిక్కెట్‌ ఇచ్చామని, బీ ఫారం మార్పు తన చేతుల్లో లేదని ఎమ్మెల్యే గణేష్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో దీని కోసం ప‌ట్టుబ‌డుతున్న బోళెం వ‌ర్గం.. నామినేషన్‌ ఉపసంహరణకు శనివారం సాయంత్రం వరకు గడువు వుండడంతో ఈలోగా తన భార్య పేరిట బీ ఫారం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పార్టీ నిర్ణయం మారకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా తన భార్యను పోటీలో ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో న‌ర్సీప‌ట్నంలో వివాదం తార‌స్థాయికి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news