కరోనా వచ్చిన కొత్తలో నగరి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. అధికారిగా ఉంటూ ఓవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజాను పొగడ్తలతో ముంచెత్తారు. కానీ.. సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సస్పెండ్ అయ్యారు వెంకట్రామిరెడ్డి.
అప్పట్లో వెంకట్రామిరెడ్డి మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినా తర్వాత రోజుల్లో ఆ మాటలే మేలు చేశాయని భావిస్తున్నారట రోజా. అందుకే ప్రభుత్వ పెద్దలను ఒప్పించి పుత్తూరు తీసుకొచ్చారని చెవులు కొరుక్కుంటున్నారు. పైగా మొదటి నుంచి తన మాట వింటూ.. అభివృద్ధి పనులకు సహకరిస్తూ.. తనపై ప్రశంసలు కురిపించిన అధికారిని వదులుకోవడానికి రోజాకు ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది.
ఎమ్మెల్యే అభిమానులు రోజానా మాజాకా అని కామెంట్స్ చేస్తుంటే.. ప్రభుత్వాన్ని విమర్శించిన అధికారికి నగరిలో మళ్లీ పోస్టింగ్ ఇప్పించడంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు రుసరుసలాడుతున్నారట. ఇదే సమయంలో వైసీపీని ఇరుకున పెట్టేలా టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. మరి.. ఈ విమర్శలకు, కామెంట్లకు ఎమ్మెల్యే రోజా బదులిస్తారో లేదో చూడాలి.