ఆయన జాతీయపార్టీకి తెలంగాణలో ఇంఛార్జ్. కానీ.. ఆయన ఎలా ఉంటారో తమకే తెలియదని ఆ పార్టీకి చెందిన నేతలు కామెంట్స్ చేస్తుంటారు. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ PK కృష్ణదాస్. ఆయన్ని ఇంఛార్జ్‌గా వేసినప్పుడు ఎవరా అని పార్టీ నేతలు ఆరా తీశారు. మధ్యలో కొన్నిసార్లు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారట. పార్టీ నేతలు ఆయన్ని సరిగ్గా చూసింది కూడా లేదు. పక్కనే ఉన్న ఏపీకి సునీల్ దేవధర్ సహ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన ఏపీ అంతటినీ చుట్టేస్తున్నారు. కానీ.. తెలంగాణలో ఇంఛార్జ్ వైఖరి దీనికి భిన్నంగా ఉందని బీజేపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
ఒకవేళ కృష్ణదాస్ సడెన్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చినా ఎవరూ గుర్తు పట్టరని బీజేపీలో జోకులు కూడా వేసుకుంటారట. ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక జరుగుతోంది. త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, GHMC, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నద్ధమవుతున్నా.. కేంద్ర పార్టీతో సమన్వయ పరిచి తగిన సూచనలు చేసే ఇంఛార్జ్ మాత్రం పత్తా లేరట.
తెలంగాణలో బీజేపీ గురించి గట్టిగా సమీక్ష చేసిన సందర్భాలు లేవట. అలాగే సమస్యలపై రాష్ట్ర నేతలను ఉరికించిన ఉదంతాలు లేవని అనుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగితే రాలేదట. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నదీ లేదు. దీంతో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ గాయబ్ అనే కామెంట్స్ పార్టీ వర్గాల్లో షికారు చేస్తున్నాయట.