పోలీసులకు సరెండరైన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?

సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆఫీస్‌కు వెళ్లి సరెండర్ అయ్యారు. హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హత్యలో తానొక్కడే పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కాగా, మరికాసేపట్లో అనంతబాబును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు
ఎమ్మెల్సీ అనంతబాబు

అయితే, బాధిత కుటుంబీకులు మొదటి నుంచే ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీనే సుబ్రహ్మణ్యంను చంపాడని ఆరోపించారు. ఇప్పుడదే నిజమైంది. అయితే పోలీసులు వారికి సహకరించలేదని, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ఆరోపించారు. రాత్రి వేళల్లో ఎంక్వైరీల పేరుతో టార్చర్ పెట్టేవారని సుబ్రహ్మణ్యం సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సుబ్రహ్మణ్యం మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మామూలోడు కాదని, ఎక్కడ తన రహస్యాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడే సుబ్రహ్మణ్యంను చంపి ఉంటాడని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. కాగా, కాకినాడలో ప్రతిపక్ష, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అనంతబాబు ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.