దుబ్బాక ఓటమి ప్రభావంతో టిఆర్ఎస్ లో ఎన్నో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఒక్క సీటు మాత్రమే పోయింది కదా అని సరిపెట్టుకోకుండా, ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రభావం రానున్న గ్రేటర్ ఎన్నికల పైన పడే అవకాశం ఉండటంతో, నష్టనివారణ చర్యలకు దిగుతుంది. ముఖ్యంగా పార్టీలోనూ, ప్రభుత్వంలో నూ పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి టిఆర్ఎస్ ను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకు వెళ్ళకపోతే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుందని కెసిఆర్ బలంగా నమ్ముతున్నారు.
తాజాగా ఈ వ్యవహారాలపై నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం కేసిఆర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎన్నికల ఓటమి పై పోస్టు మార్టం తో పాటు, గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యవహారాలపైనా, బీజేపీ ఏవిధంగా బలం పుంజుకుంటుంది అనే విషయంపైనా, క్లారిటీ తెచ్చుకునే అంశంపై సహచర మంత్రులతో కేసీఆర్ సీరియస్ గా చర్చించబోతున్నారు. అయితే త్వరలోనే క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని, ప్రస్తుతం వివిధ ఆరోపణలు ఎదుర్కొంటూ , పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ,నిర్లక్ష్యంగా ఉన్నా మంత్రులను తప్పించాలని కెసిఆర్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే.. ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిచిన తన కుమార్తె కవిత కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ సరైన సమయం కోసం చూస్తున్నారు.
అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులు వ్యవహారాలు మీడియాలో రచ్చ అవడం, దుబ్బాక ఎన్నికలలో ఓటమి, వీటన్నిటిని సాకుగా చూపించి పనితీరు సక్రమంగా లేని మంత్రులందరినీ ఇంటికి సాగనంపాలని, కొత్తగా కవితతో పాటు, పార్టీలో చురుగ్గ ఉంటూ, రాజకీయ ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న వారికి మంత్రులుగా అవకాశం కల్పించాలని కెసిఆర్ చూస్తున్నారట. కవితకు కీలకమైన మంత్రి పోర్ట్ ఫోలియో కట్టబెట్టడం ద్వారా, ప్రభుత్వంలోనూ , పార్టీలోనూ గణనీయమైన మార్పులు వస్తాయనే అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మంత్రివర్గ ప్రక్షాళన గ్రేటర్ ఎన్నికలకు ముందు చేయాలా ? ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత చేయాలనే విషయంపై ఇప్పుడు కేసీఆర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో అనుకున్న దాని కంటే కాస్త ముందుగానే కవిత మంత్రి అయ్యే అవకాశం ఉందంటూ పార్టీలు ఇప్పుడు చర్చ జరుగుతోంది.