తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో.. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది.
అలానే వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నల్గొండ ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ పోటీలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు పోలింగ్ కూడా భారీగా జరగటంతో ఫలితాలు వెలువడేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అంటున్నారు, ఇక ఏపీలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్‌టీయూ, గుంటూరు ఏసీ కాలేజ్ లలో కొనసాగుతోంది.