అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఓ అంబులెన్స్ రావడంతో ప్రధాని తన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఆ అంబులెన్స్ వెళ్లిన తర్వాత ప్రధాని వాహన శ్రేణి ముందుకు కదిలింది. వాహనంలో కూర్చున్న మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను భాజపా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోదీని ఊరికే ప్రధాన మంత్రి అనరని.. హిమాచల్‌ప్రదేశ్‌లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు ప్రధాని తన కాన్వాయ్‌ను నిలిపివేశారని.. విలువైన ప్రాణాల్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ అంబులెన్స్‌కు దారి ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల గుజరాత్ పర్యటనలోనూ ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ అంబులెన్స్ రావడంతో ప్రధాని తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకు నిలిపివేసిన విషయం తెలిసిందే.