భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్ఞు తన భార్యతో కలిసి మంగళవారం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను సందర్శించారు. తాజ్‌మహల్ అందాలను వీక్షించిన ముయిజ్ఞు దంపతులు పాలరాయి కట్టడం ఎదుట ఫొటోలు దిగారు. ముయిజ్జు పర్యటన నేపథ్యంలో రెండు గంటల పాటు సందర్శకులను లోనికి అనుమతించలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది.ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకున్న ముయిజ్ఞు దంపతులకు యూపీ మంత్రి యోగేంద్ర ఉద్యాయ్ స్వాగతం పలికారు.
నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపడంతో పాటు కీలక ఒప్పందాలు చేసుకున్నారు.భారత్ సహకారంతో మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్ వేను ముయిజ్జు, మోదీ సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు తాజాగా భారత్ 40 కోట్ల డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.