హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతితోనే దళిత సమావేశానికి హాజరయ్యానని మోత్కుపల్లి పేర్కొన్నారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని కాపాడానన్నారు. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదని ఆయన తెలిపారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. సమావేశానికి వెళ్ళాను కాబట్టే దళితుల సమస్యలపై మాట్లాడగలిగానన్నారు.
ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన దళిత ఎన్పవర్మెంట్ సమావేశం చారిత్రాత్మకమైనదని మోత్కపల్లి తెలిపారు. వ్యాపారాల కోసం పార్టీల మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను దగ్గరవ్వలేదని, దూరమూ జరగలేదన్నారు. స్వలాభం కోసం పార్టీలు మారనని స్పష్టం చేశారు. తాను బీజేపీలోనే ఉన్నానని, ఉంటానని పేర్కొన్నారు. దళిత, ఆలయ భూములను వెనక్కి ఇచ్చి ఉంటే తనకు గ్రాఫ్ పెరిగేదని స్వయంగా ఈటల రాజేందర్‌కు చెప్పానని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ లాంటి బీసీ వ్యక్తికి పెద్ద ఎత్తున ఆస్తులుండటం సంతోషకరమని బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు.