కేసీఆర్ పై త్వరలో యుద్ధ ప్రకటన చేయబోతున్నామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం సాయంత్రం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ‘పద్నాలుగు వందల మంది ఆత్మబలిదానాలతో సబ్బండ వర్గాల పోరాట స్పూర్తితో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకుని ప్రజాకంఠక పాలన చేస్తున్న కేసీఆర్పై యుద్ధప్రకటన అతి త్వరలో చేయబోతున్నాము. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా నా మునుగోడు నియోజకవర్గం కక్షగట్టి మూడున్నర ఏళ్లుగా నాతో పాటు నా నియోజకవర్గ ప్రజల్ని అనేక రకాలుగా అవమానపరిచి అభివృద్ధిని నిలిపేశాడు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్లు 90 శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా…. నన్ను గెలిపించారన్న ఒక్క కారణంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన కిష్టరాయినిపల్లి భూనిర్వాసితులకు మల్లన్న సాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వముంటే… వారిపై పోలీస్ లాఠీలు ఝులిపించి అక్రమ కేసులు పెట్టారు. నేను రెండేళ్ల క్రితమే చెప్పా.. గజ్వెల్, సిరిసిల్ల, సిద్ధిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తా అని.. హుజూరాబాద్లో మాదిరిగి మునుగోడులోని నా దళిత సోదరులందరికీ దళితబంధు, ఇతర చేనేత,గౌడ,యాదవ,ముదిరాజ్, మైనారిటీ సోదరులందరీ సంక్షేమ పథకాలు ఇస్తే నేను స్వచ్చందగా రాజీనామా చేస్తానని ఏడాది క్రితమే చెప్పా.
సొంత ఆస్తులు పెంచుకుంటూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చి రాష్ట్రంలో అన్ని వర్గాలకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ – టీఆర్ఎస్ రాక్షస పాలన నుండి విముక్తి చేసే దిశగా నేను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తేలేదు నేనుమొదటి నుండి చెబుతున్న విషయంలో డైలమా, వెనకడుగు నా రక్తంలోనే లేదు.. నా సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో చేస్తున్న పోరాటం కాదు ఇది. ఇప్పటికే నా నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించే కేసీఆర్ ఆయన పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించాము. మునుగోడు నియోజకవర్గ ప్రజలు -మేధావులు, కవులు కళాకారులు, యువజన, విద్యార్ధి, ఉద్యోగవర్గాలన్నీ నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అతి త్వరలో మరింత విస్తృత సంప్రదింపులు చేసి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి – కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తాం. వందిమాగదులు, వందల కోట్ల డబ్బు సంచులతో వచ్చే కేసీఆర్ ఆయన కౌరవ సేనను ఎదిరించి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా మునుగోడు వేదికగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాము.’ అని ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.