వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama krishnam raju) పక్కా ప్లాన్ ప్రకారం వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు ఆయన. తనపై మోపిన రాజద్రోహం కేసుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేలా పావులు కదుపుతున్నారు. అలాగే తన ఒంటి మీద గాయాలను చూపిస్తూ తనపై కస్టడీలో జరిగిన దాడిని ఖండించాలంటూ కోరుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎంపీలకు లేఖలు రాసిన రఘురామ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై దాడిని, రాజద్రోహం కేసును ఖండిస్తూ మద్దతు తెలపాలని కోరతూ సోమవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎంపీ లేఖ రాశారు.
ఐదు పేజీల లేఖతో పాటు తనపై జరిగిన దాడికి సంబంధించిన గాయాల ఫొటోలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఇతరా ఆధారాలను వాటికి జత చేశారు. తనకు కొద్ది నెలల క్రితమే బైపాస్ సర్జరీ జరిగిందని అయినా ఎలాంటి కనికరం లేకుండా ఎంపీనని కూడా చూడకుండా దాడి చేశారంటూ సీఐడీ పోలీసులపై విమర్శలు చేస్తూ లేఖలు రాశారు. రాజద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై చర్యలు తీసుకునేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్టయింది.