ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే… కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకొని… హోదా బదులు ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధపడటంతోనే ప్రత్యేక హోదా అంశం అటకెక్కినట్లైంది. అయితే తాజాగా ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి ఈ రోజు రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తూ.. కేంద్రం ఆ సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో పేర్కొన్న విభజన హామీల్లో భాగంగా.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇప్పటివరకు అమలుకాలేదన్నారు. రాష్ట్ర పతి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అంతేకాక, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి న్యాయం జరగలేదని చెప్పారు.