టెలికాం సంస్థ రిలయన్స్ జియో గతంలో జియో ఫోన్, జియో ఫోన్ 2 లను లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఆయన వర్చువల్‌గా మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు చేశారు.
త్వరలోనే జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో వచ్చిన జియో ఫోన్లు ప్రత్యేక కై ఓఎస్‌తో నడిచేవి. కానీ జియో ఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో నడుస్తుంది. ఇక త్వరలోనే రిలయన్స్ జియో 5జి సేవలను ప్రవేశపెట్టనుంది. ఇందుకు గాను రిలయన్స్ సంస్థ గూగుల్‌తో భాగస్వామ్యం అయింది. గూగుల్ క్లౌడ్‌తో అనుసంధానం అయి జియో 5జి సేవలను తన వినియోగదారులకు అందిస్తుంది.
ఇక జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌ను వచ్చే వినాయక చవితి నాడు.. అంటే సెప్టెంబర్ 10న లాంచ్ చేయనున్నట్లు అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అందిస్తారు. ఇందులో ట్రాన్స్‌లేషన్, కెమెరా, హెడీఆర్ వంటి ఫీచర్లను అందిస్తారు. అతి తక్కువ ధరకే ఈ ఫోన్‌ను అందిస్తామని అంబానీ ప్రకటించారు. ఇందులో 4జి మాత్రమే లభిస్తుంది.
కాగా దేశంలో మొట్ట మొదటిగా 5జి సేవలను అందించేది జియోనేనని అంబానీ వెల్లడించారు. ఇప్పటికే పలు చోట్ల ట్రయల్స్ చేపట్టామని, గరిష్టంగా 1 జీబీపీఎస్ స్పీడ్‌ను సాధించామని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన 5జి సేవలను అందిస్తామని తెలిపారు. అయితే 5జి సేవలను ఎప్పటి నుంచి లాంచ్ చేస్తారో వెల్లడించలేదు. కానీ ఈ ఏడాది చివరి వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.