ధనసరి అనసూయ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ సీతక్క అనగానే అందరి ఇట్టే తెలిసిపోతుంది. నక్సలైట్‌గా పనిచేసి బయటకు వచ్చిన సీతక్క.. ఆ తర్వాత టీడీపీలో చేరి ఓ వెలుగు వెలిగారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవుతున్న సమయంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మరికొందరు నాయకులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క.. నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తన నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. కనీసం రోడ్లు కూడా లేని గ్రామాలకు వాగులు దాటుకుంటూ వెళ్లి కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఎడ్లబండ్ల మీద కూరగాయలు వెళ్తుంటే.. ఆమె కాలి నడకన ముందుకు సాగుతున్నారు.
నేడు ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సీతక్క.. 12 గ్రామాల్లో బియ్యం, కూరగాయలు పంచినట్టు తెలిపారు. అలాగే ఓ సరదా సన్నివేశాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ‘నేను ఈ వాగు దాటుతుంటే.. ఇది నన్ను పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. ఆ సమయంలో నా చేతిలో తుపాకీ ఉండేంది.. ఇప్పుడు కూరగాయలు, బియ్యం ఉన్నాయి’ అని సీతక్క ట్వీట్ చేశారు.
When I was crossing this It took back me to my old days that time gun in my hand now rice and vegetables, distributed in 12 villages @MahilaCongress @INCIndia @INCTelangana @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @sushmitadevinc @MYaskhi @IYC #HumeGarvHai #Lockdown2 #congress pic.twitter.com/0lDFH86euL
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) April 14, 2020