కరోనా నేపథ్యంలో 2023 వరకు పూర్తి కావల్సిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు గాను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) ఇప్పటికే 63 శాతం స్థలాన్ని సేకరించింది. అందులో 77 శాతం గుజరాత్‌లో ఉండగా, 80 శాతం దాదర్ నాగర్ హవేలిలో, మరో 22 శాతం మహారాష్ట్రలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న సివిల్ వర్క్‌లకు గతేడాదే 9 టెండర్లు వచ్చాయి. కానీ కరోనా నేపథ్యంలో అధికారులు వాటిని ఇంకా ఓపెన్ చేయలేదు.
కాగా ఈ ప్రాజెక్టుకు 2023 వరకు డెడ్‌లైన్ అనుకున్నారు. కానీ ఇప్పటికప్పుడు టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టులు అప్పగించినా పనులు పూర్తయ్యేందుకు కనీసం 30 నెలలు పడుతుంది. అంటే దాదాపుగా 3 ఏళ్లు. అయితే కరోనా నేపథ్యంలో ఆ పనులు ఇప్పుడప్పుడే ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో 2023 వరకు బుల్లెట్ ట్రైన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1.08 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. అందులో రూ.20వేల కోట్లను సివిల్ వర్క్‌ల కోసం కేటాయించారు. రైల్వే స్టేషన్లు, బ్రిడ్జిలు, వయాడక్ట్‌లు, మెయింటెనెన్స్ డిపోలు, సొరంగాల నిర్మాణాలు అందులో ఉన్నాయి. ఇక మొత్తం ఖర్చుల రూ.10వేల కోట్లను భారత ప్రభుత్వం ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ కు ఇవ్వనుంది. అలాగే గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు చెరో రూ.5వేల కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని జపాన్ నుంచి 0.1 శాతం వడ్డీతో అప్పు తీసుకుంటున్నారు. అయితే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కనిపించకపోవడంతో ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.1.70 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 508.17 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే కరోనా వల్ల ఈ పనులు చాలా ఆలస్యంగా పూర్తవుతాయని స్పష్టమవుతోంది.