రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేసేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా పైఎత్తులు వేస్తూనే ఉంటుంది. తనకు తిరుగులేదని, తననే గెలిపిస్తారని భావించిన అనేక మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి గత ఎన్నికల్లో చూశాం. ఇక, ఇప్పుడు జగన్ సర్కారు దూకుడుతో ఈ జాబితా మరింతగా పెరుగుతోంది. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు.
గురజాల నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు, రైతు కూలీలు ఉన్నారు. వీరికి వ్యవసాయమే ఆధారం. అయితే, సాగునీరు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వరికపూడిసెల పూర్తి చేయడం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేది తామేనని, దానిని పూర్తి చేసేలా చూడాలని వినుకొండ, గురజాల ఎమ్మెల్యేలను గతంలో ఇక్కడి రైతాంగం విన్నవించుకున్నారు. దీనిపై వారు కూడా కొంతమేరకు కృషి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో అప్పట్లో దీనిపై చర్చించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ పార్టీ తరఫున యరపతినేని శ్రీనివాసరావు కూడా వరికపూడి సెలను పూర్తి చేయించే భాగంలో తానుకూడా ముందుంటానని హామీ ఇచ్చారు.
కానీ, 2014-18 వరకు యరపతినేని ఈ విషయాన్ని మరిచిపోయారు. మళ్లీఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబుకు విన్నవించి.. దీనిని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ.. జీవో అయితే ఇప్పించారు తప్ప.. నిధుల విషయాన్ని మరిచిపోయారు. ఫలితంగా ప్రాజెక్టు మళ్లీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా మారిపోయింది. ఇక, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నియోజకవర్గాల్లో ప్రధాన డిమాండ్ గా ఉన్న వరికపూడిసెలపై జగన్‌ను కలిశారు. గతంలో జగన్ పాదయాత్ర చేసిన సమయంలోనూ ఇక్కడి ప్రజలు దీనిపై విన్నవించారు.
ఈ మొత్తం పరిణామాల క్రమంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలింది. నిధులు కేటాయించింది. ఫలితంగా ఇప్పుడు రైతులకు వైసీపీ చుక్కానిగా మారింది. నిజానికి టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రైతాంగం మనసు దోచుకుంటే.. ఇక తమకు తిరుగులేదని భావించిన వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇది యరపతినేని ఫుల్‌గా మైనస్ అవుతుందని చెబుతున్నారు. వరికపూడి సెల వాస్తవానికి మాచర్ల నియోజకవర్గంలోనేఉన్నా.. దీనికి దిగువ నియోజకవర్గంగా ఉన్న వినుకొండ, గురజాల ప్రాంతాలు పూర్తిగా అబివృద్ది చెందుతాయని, ఈ క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని అంటున్నారు.