మెట్రోపాలిటన్ నగరాల్లో వాహనాల డ్రైవింగ్ విషయానికి వస్తే ముంబై నగరం డ్రైవింగ్ చేసేందుకు అత్యంత చెత్త నగరమని తేలింది. మిస్టర్ ఆటో అనే సంస్థ విడుదల చేసిన 2019 డ్రైవింగ్ సిటీస్ ఇండెక్స్‌లో ఈ విషయం వెల్లడైంది.
మన దేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిత్యం ఆయా నగరాల్లో అనేక చోట్ల వాహనదారులు రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్‌లో బారులు తీరుతుంటారు. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకుంటూ తమ తమ గమ్య స్థానాలకు వెళ్తుంటారు. అయితే మెట్రోపాలిటన్ నగరాల్లో వాహనాల డ్రైవింగ్ విషయానికి వస్తే ముంబై నగరం డ్రైవింగ్ చేసేందుకు అత్యంత చెత్త నగరమని తేలింది. మిస్టర్ ఆటో అనే సంస్థ విడుదల చేసిన 2019 డ్రైవింగ్ సిటీస్ ఇండెక్స్‌లో ఈ విషయం వెల్లడైంది.
సదరు సంస్థ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలోని 100 ప్రముఖ మెట్రోపాలిటన్ నగరాల్లో డ్రైవింగ్ చేసేందుకు అత్యంత అనువుగా, సులభతరంగా ఉన్న నగరాలు కెనడాలోని కల్గరీ, దుబాయ్‌లు అని వెల్లడైంది. ఇక ఈ జాబితాలో ముంబై అట్టడుగు స్థానంలో నిలవగా దాని ముందు కోల్‌కతా నిలిచింది. అంటే ఈ రెండు నగరాలు డ్రైవింగ్ చేసేందుకు అత్యంత చెత్త నగరాలన్నమాట. ఆ నగరాల్లో డ్రైవింగ్ చేయడం నరకంతో సమానమని అర్థం. ప్రపంచంలోని సదరు 100 నగరాల్లో అందుబాటులో ఉన్న సరైన రోడ్లు, సేఫ్టీ, ఇంధన ఖరీదు, పార్కింగ్ సౌకర్యం, ఎయిర్ క్వాలిటీ, రోడ్ క్వాలిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆ సంస్థ పైన చెప్పిన నివేదికలో ఆయా నగరాలకు ర్యాంకులను ప్రకటించింది. ఈ క్రమంలో ముంబై, కోల్‌కతా నగరాలు ఆ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలవడం విశేషం..!