రివ్యూ – నయీం డైరీస్

-

రివ్యూ – నయీం డైరీస్

నటీనటులు – వశిష్ట సింహ, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు

సాంకేతిక నిపుణులు- సినిమాటోగ్రఫీ – సురేష్‌ భార్గవ్‌, సంగీతం– అరుణ్‌ ప్రభాకర్‌, ఎడిటర్‌ – కిషోర్‌ మద్దాలి, పీఆర్వో – జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ


ఇవాళ దేశవ్యాప్తంగా చిత్రపరిశ్రమల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. వివిధ రంగాలకు చెందిన గొప్పవాళ్ల జీవిత కథలో తెరపైకి వస్తున్నాయి. బయోపిక్ తీయాలంటే గొప్పవాళ్లే కానక్కర్లేదు…క్రిమినల్ జీవిత చరిత్ర ద్వారా కూడా సమాజానికి బివేర్ ఆఫ్ దీస్ పర్సన్స్ అనే హెచ్చరిక ఇవ్వొచ్చు అనేలా తెరకెక్కిన సినిమా నయీం డైరీస్. దర్శకుడు దాము బాలాజీ రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

నయీం (వశిష్ట సింహా) ఆవేశపరుడైన వ్యక్తి. త్వరగా రియాక్ట్ అయ్యే తత్వం గలవాడు. దూకుడు స్వభావంతో ప్రవర్తిస్తుంటాడు. బయట ఎలా ఉన్నా, అతనికి కుటుంబం అంటే చాలా ప్రేమ. ముఖ్యంగా సోదరి (యజ్ఞశెట్టి) అంటే చాలా ఇష్టం. విప్లవానికి ఆకర్షితుడైన నయీం నక్సల్స్ ఉద్యమంలో చేరుతాడు. ఫేక్ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులకు పట్టుబడతాడు. పట్టుబడిన నయీం, ఇతర నక్సలైట్ నాయకులకు జైలు శిక్ష పడుతుంది. నయీం సోదరిపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తికి చిన్న శిక్ష విధించి నక్సల్స్ వదిలేయడం నయీం, అతని సోదరుడి వలీకి నచ్చదు. జైల్లో ఉన్న నయీం సోదరుడు వలీ సహాయంతో తన సోదరిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని చంపిస్తాడు. దీంతో పార్టీ గీత దాటినందుకు నయీంను నక్సలైట్లు కమిటీ నుంచి బహిష్కరిస్తారు. ఈ హత్య కేసులో నయీం సోదరిపై పోలీసు ఆఫీసర్ (శశి కుమార్) ఒత్తిడి తీసుకొస్తారు. ఇంతలో వలీ హత్య జరుగుతుంది. సోదరుడిని చంపింది నక్సలైట్ ప్రోద్బలంతోనే నని తెలుసుకుంటాడు నయీం. సోదరిపై పోలీసులు పెడుతున్న ఒత్తిడి, తమ్ముడి హత్యతో నక్సలైట్ల ఏరివేతలో పోలీసులకు సహకరించేందుకు నయీం ఒప్పుకుంటాడు. ఉద్యమకారిని, తన ప్రేయసి అయిన లత (సంయుక్త) సహకారం కోరతాడు. నక్సలైట్ ఉద్యమాన్ని ప్రాణంగా ప్రేమించిన నయీం, ఆ నక్సలైట్ల ఎన్ కౌంటర్ లకు ఎలా సారథ్యం వహించాడు. పోలీసు, రాజకీయ వ్యవస్థలు, కుటుంబ ప్రేమ అతన్ని ఎలా క్రూరమైన నేరస్తుడిగా మార్చాయి అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే…

నయీం డైరీస్ సినిమా కోసం దర్శకుడు దాము బాలాజీ చాలా రీసెర్చ్ చేసినట్లు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రతి పాత్ర, ఆ పాత్ర ప్రవర్తించే తీరు, పలికే మాటలు, కనబరిచే స్వభావం, సన్నివేశాలు జరిగే సందర్భం, తేదీలతో సహా తెరకెక్కించారు దాము బాలాజీ. ఆయన చేసిన పరిశోధన స్క్రీన్ మీద వ్యక్తమైంది. అలాగే సినిమాను సాధ్యమైనంత వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దీంతో కథనంలో ఎక్కడా హీరోయిజం ఎలివేషన్స్, అక్కర్లేని కమర్షియల్ అంశాలకు తావులేకుండా అయ్యింది. నేరస్తుడు ఒక్కసారే నేరం చేస్తాడు….కానీ వ్యవస్థ అనేకసార్లు నేరం చేసేలా పురికొల్పుతుంది అనేది నయీం విషయంలోనూ జరిగింది. దీన్నే సినిమాలో చూపించారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరులో నయీం ఒక్కోసారి ఒక్కో వర్గం వైపు ముందుండి నడిపించాడు. నయీం మంచివాడు అనే వత్తాసు పలకకుండా బ్యాలెన్స్డ్ గా ఏం జరిగింది, మనకు తెలియని పాత్రల ప్రభావం నయీం జీవితం మీద ఏంటి అనేది సినిమాలో చూపించారు.

నయీం క్యారెక్టర్ కు అలాగే రూపురేఖలు ఉండే నటుడిని తీసుకోవద్దు అనే దర్శకుడి ఆలోచన సరైనదే. వశిష్ట సింహా నయీం పాత్రలోనే ఇంటెన్సిటీని తన నటనలో చూపించారు. భావోద్వేగం, కుటుంబం మీద ప్రేమ, శత్రువుల మీద పగ, పట్టరాని ఆవేశం, క్రోధం…ఇలాంటి హావభావాలన్నీ వశిష్ట సింహా నటనలో చూస్తాం. నయీం సోదరిగా నటించిన యజ్ఞశెట్టి పాత్రోచితంగా నటించింది. లత పాత్రలో సంయుక్త పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. తన ప్రేమనంతా మాటల్లో కాకుండా చూపుల్లోనే కనబర్చింది. జబర్దస్త్ ఫణి, దివి వద్యాత మిగతా పాత్రధారులంతా చక్కగా నటించారు. సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది. అరుణ్ ప్రభాకర్ సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు ఏం కావాలో అది అందించాయి. సినిమాలో కథను అనుసరించిన సాగిన హింసను కాస్త లైటర్ వేన్ లో చూపిస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ కు చూసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేది. ఏమైనా ఒక భయపెట్టే వ్యక్తి బయోగ్రఫీలో చాలా నిజాలను ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.

రేటింగ్ 3/5

Read more RELATED
Recommended to you

Latest news