తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి టీఆర్ఎస్ కీలక నేతల్లో ఎవరో ఒకరు ఏదో ఒక అసంతృప్త వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు. ముందుగా మంత్రి ఈటల రాజేందర్ తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్టార్ట్ అయిన ఈ అసంతృప్త నేతల పర్వం అక్కడ నుంచి ఆగలేదు. రాజేందర్ గులాబీ జెండా ఓనర్లలో తాను కూడా ఒకడినే అన్న కొద్ది రోజులకే మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇక్కడ తెలంగాణ వచ్చినా ఏం జరగలేదని… జరిగిన మార్పు అల్లా ఆంధ్రా బోర్డు పోయి తెలంగాణ బోర్డు మాత్రమే వచ్చిందని ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ఆదివారం మంత్రి వర్గ విస్తరణ జరగడంతో చాలా మంది నేతలకు పదవులు రాకపోవడంతో వారు ఫైర్ అవుతున్నారు. ఎవరు తమ బాధ ఎలా ? చెప్పుకోవాలో తెలియక లోలోపలే తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇక సోమవారం పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని ఆయన ఫైర్ అయ్యారు. హోం మంత్రిగా చేసిన తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఎందుకని ? అందులో రసం లేదన్నారను.
ఇక నాయిని వ్యాఖ్యలు చేసిన వెంటనే మరో నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని అన్నారు. కేసీఆర్ కేబినెట్ విస్తరణలో మల, మైనార్టీ, గిరిజన, కమ్మ, మున్నూరు కాపు , రెడ్లు, వెలమలకు ప్రాధాన్యం ఉన్నా మాదిగలు ఒక్కరు కూడా లేకపోవడంతో ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక అదే విషయాన్ని రాజయ్య బయట పెడుతూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా టీఆర్ఎస్‌లో అసమ్మతి గళాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.