టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించిందా? నందమూరి కుటుంబాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తొక్కి పెడుతున్నారా? ఇప్పుడు ఇదే విషయం పార్టీలోను, నందమూరి కుటుంబంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు.. కుటుంబానికి పార్టీలో తగిన ప్రాధాన్యం లేదనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. గతంలో హరికృష్ణకు రవాణా శాఖ మంత్రి పదవిని ఇచ్చి.. ప్రాధాన్యం లేకుండా చేశారనే టాక్ ఉంది. తర్వాత కూడా ఆయనకు పార్టీలో పెద్దగా గుర్తింపు లేకుండా చేశారని చంద్రబాబుపై ఇప్పటికీ నందమూరి కుటుంబంలో ఆవేదన ఉంది.
అయితే, రాజ్యసభకు పంపించినా.. మరోసారి రెన్యువల్ చేయకపోవడంతో హరికృష్ణ కూడా పార్టీకార్యక్ర మాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఆయన మరణం తర్వాత.. అనూహ్యంగా 2018లో తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి బలం లేదని తెలిసి కూడా చంద్రబాబు నందమూరి కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై ఆ ఫ్యామిలీ అభిమానులు, అన్నగారి అభిమానులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆమె ఓడిపోయాక.. మళ్లీ సైలెంట్.. నిజానికి నందమూరి సుహాసినికి చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని అనుకుంటే.. ఏపీలోనే ఇవ్వొచ్చనే టాక్ ఉంది.
ఇక, ఇప్పుడు మరోసారి పార్టీ పదవుల పందేరంలోనూ సుహాసినికి ఏపీలో చోటివ్వలేదు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షరాలి పదవి ని అప్పగించారు. నిజానికి ఇప్పుడు తెలంగాణలో పార్టీ పూర్తిగా లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శించే దైర్యం లేదు. ఎందుకు ఉందా?! అనే వ్యవహారంలో ఉన్న పార్టీలో నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఎందుకు నియమించారు? అదే ఏపీలోకి తీసుకువచ్చి.. గుడివాడ వంటి కీలక నియోజకవర్గంలో అవకాశం ఇచ్చి ఉంటే.. బాగుండేది కదా అన్న అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ పుట్టిపెరిగిన ఊరు ఇక్కడే ఉంది కాబట్టి.. కొంతమేరకైనా న్యాయం జరిగి ఉండేదని అంటున్నారు. గుడివాడ కానిపక్షంలో ఆమె సొంత జిల్లా తూర్పు గోదావరి ( సుహాసిని అత్తవారి జిల్లా) లోని రాజమహేంద్రవరం ఎంపీ సీటు పగ్గాలు ఇచ్చినా బాగుండేదని అంటున్నారు. ఈ పరిణామాలతోనే నందమూరి కుటుంబంలో నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని… మరోసారి బాబు చేసిన పనితో నందమూరి ఫ్యామిలీ డై హార్ట్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారన్న చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
-vuyyuru subhash