నేచురల్ స్టార్ నాని యాక్షన్ థ్రిల్లర్ `వి` తరువాత వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న `టక్ జగదీష్` చిత్రం ఒకటి కాగా `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ డైరెక్ట్ చేస్తున్న `శ్యామ్ సింగ్ రాయ్`. ఇందులో `టక్ జగదీష్` చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక `శ్యామ్ సింగ్ రాయ్`ని వెంకట్ బోయిన్ పల్లి నిర్మిస్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించడానికి ముందు కొచ్చారు.
ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. లాక్‌డౌన్ తరువాత ఈ మూవీ చేతులు మారింది. వెంకట్ బోయిన్‌పల్లి చేతుల్లోకి మారింది. దీని వెనక పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. నాని నటించిన చిత్రాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించడం లేదు. అయినా తన చరిష్మా ఏమాత్రం తగ్గడం లేదు. మినిమమ్ 25 కోట్లు బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్ స్థాయిని అదే రేంజ్‌లో మెయింటైన్ చేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ తరువాత సమీకరణాలు మారిపోయాయి.
తాజా మరిణామాల నేపథ్యంలో స్టార్స్ తమ పారితోషికాలని తగ్గించుకోవాలంటూ కొత్త నినాదం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో `శ్యామ్ సింగ్‌రాయ్` నిర్మాత సూర్యదేవర నాగవంశీ హీరో నానికి తన పారితోషికం తగ్గించుకోవాలని కండీషన్ పెట్టారట. అది నచ్చని నాని ఏకంగా నిర్మాతనే మార్చినట్టు తెలిసింది. చేతులు మారిన ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి రానుందని తెలిసింది.