కొత్త ఇంఛార్జ్‌ దగ్గర మార్కులు కొట్టేసే పనిలో టీ కాంగ్రెస్ లీడర్లు…?

వరుసగా రెండు ఉప ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాకలో మాత్రం గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అందుకే AICC తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సరికొత్త ప్లాన్‌ వేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. సీనియర్‌ నాయకులన్నవారికి దుబ్బాక నియోజకవర్గంలోని ఒక్కో మండలం అప్పగించారు. తమకు అప్పగించిన మండలాల్లో కాంగ్రెస్‌పార్టీకి మంచి మైలేజీ తెప్పించే బాధ్యత ఇప్పుడు సీనియర్లపై పడింది.

అనేక ఎన్నికల్లో పోటీ చేసిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ప్లాన్‌ చేసుకోలేదట. దుబ్బాకలో మాత్రం ఎక్కువ ఎఫర్ట్‌ పెడుతున్నారని టాక్‌. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మిత్రపక్షం జనసమితికి ఈ స్థానం కట్టబెట్టారు. దాంతో కాంగ్రెస్‌ కేడర్‌ దెబ్బతింది. ఇప్పుడు మొదటి నుంచి శక్తిని కూడదీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇదో పరీక్షగా భావించి నిత్యం దుబ్బాకలోనే కనిపిస్తున్నారు ఉత్తమ్‌.

పీసీసీ చీఫ్‌ పీఠంపై కన్నేసిన రేవంత్‌రెడ్డి సైతం ఇంఛార్జ్‌ ఠాగూర్‌ దగ్గర మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారట. ఉప ఎన్నికలో మిరుదొడ్డి మండల బాధ్యత చూస్తోన్న ఆయన.. తన టీమ్‌ను దించేశారు. అధికారపార్టీ కంటే ఎక్కువ ఓట్లు ఈ మండలంలో కాంగ్రెస్‌కు పడేలా ప్లాన్‌ వేశారట. అదేలక్ష్యంగా పనిచేస్తున్నారట రేవంత్‌.

దౌల్తాబాద్‌ మండలానికి ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే.. ఈ మండలంలో టీఆర్‌ఎస్‌ కంటే 100 ఓట్లు ఎక్కువే తెస్తానని శపథం చేశారు. మరి.. ఆ మాట నిలబెట్టుకుని మార్కులు సంపాదిస్తారో లేదో అన్న చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థి శ్రీనివాసరెడ్డి కంటే ఎక్కువ టెన్షన్‌ పడుతున్న ఈ సీనియర్లు ఏ మేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ టార్గెట్‌ కూడా ఇంఛార్జ్‌ ఠాగూర్‌ దగ్గర మార్కులు కొట్టేయడమేనట. ముత్యం శ్రీనివాసరెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి పార్టీకి కొంత మేలు చేశారనే అభిప్రాయాన్ని కలిగించారట. ఆయనైతే ఈ విషయంలోనే మార్కులు కొట్టేశారని చెవులు కొరుక్కుంటున్నారు.