టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నేడు హైకోర్టు ఉత్తర్వుల మేరకు మధ్యంతర బెయిల్ తో బయటకు రావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారన్న సమాచారంతో నారా భువనేశ్వరి భావోద్వేగాలకు లోనయ్యారు.
ఈ 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట కలిగించిందని చెప్పారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు ఇచ్చారని వివరించారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు. అంతకు ముందు చంద్రబాబు బెయిల్ పై స్పందించిన భువనేశ్వరి న్యాయం గెలిచింది.. జనం గెలిచారు అంటూ పేర్కొన్నారు. ఈ గెలుపు రాష్ట్ర ప్రజలందరిదీ అని, పోరాటం చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయం గెలవాలి యాత్ర కొనసాగించాలా వద్దా అనేది ఇంకా ఆలోచించలేదని, ముందు తన చంద్రబాబును చూడాలని పేర్కొన్నారు భువనేశ్వరి.