ఆడ‌బిడ్డ‌ల‌పై అఘాయిత్యాత‌కు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ..లోకేష్ ఫైర్..!

జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రత పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమ‌ని అన్నారు. గుంటూరు నుండి బైక్ పై సత్తెనపల్లి వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిందని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫిర్యాదు చెయ్యడానికి వెళితే మా లిమిట్స్ లోకి రాదు వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అని పోలీసులు చెప్పడం ఇంకా ఘోరమ‌ని లోకేష్ మండిప‌డ్డారు. ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా నన్ను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకి జగన్ రెడ్డి వాడుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వ‌చ్చిందంటూ లోకేష్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.