బుల్లెట్ బండి పాట జోరు.. తాతతో బామ్మ స్టెప్పులు.. నెట్టింట హల్చల్

ఈ మధ్య కాలంలో బుల్లెట్ బండి పాటకు వచ్చినంత పాపులారిటీ మరే పాటకు రాలేదంటే అతిశయోక్తి కాదేమో! ఎక్కడ చూసినా, ఏ పెళ్ళికి వెళ్ళినా అదే పాట మార్మోగుతుంది. మోహన భోగరాజు గళం నుండి వచ్చిన అచ్చమైన పల్లెటూరి జానపదం జనాలతో స్టెప్పులు వేయిస్తుంది. ఇంతకుముందు పెళ్ళి బారాత్ లో నవ వధువు వేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే.

బారాత్ లో భర్తతో కలిసి వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ ను షేక్ చేసాయి. తాజాగా మరో వీడియో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తుంది. అప్పుడు నూతన వధువు స్టెప్పులు వేస్తే, ఇప్పుడు ఎనభైయేళ్ళ బామ్మ, బుల్లెట్ బండి పాటకు కాళ్ళు కదిపారు. ముందుగా తాతయ్యను కూర్చోబెట్టుకుని బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఇదే కాదు బుల్లెట్ బండి పాటపై ఇంకా చాలా మీమ్స్, ఇమేజెస్ వస్తున్నాయి. మొన్నటిదాకా దగ్గు దగ్గు, ఇప్పుడంతా డుగ్గు డుగ్గు అన్న వ్యాఖ్యలతో పాటు అనేక మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒకపాటపై ఇన్ని రకాల మీమ్స్ రావడం, ఇంతలా జనాల్లోకి వెళ్ళడం ఇదే ప్రథమం కావచ్చు.