కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీమోహన్ ఇటీవల తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వంశీ పార్టీ మారే విషయంలో డైలమాలో ఉన్నా రేపో మాపో ఆయన పార్టీ మారడం మాత్రం ఖాయం. వైసీపీ కండువా కప్పుకునే ముందే వంశీ తన ఎమ్మెల్యే పదవిని ఖచ్చితంగా వదులుకోవాలి. అదే జరిగితే అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి తిరిగి వంశీయే పోటీ చేస్తాడా ? లేదా గత ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తారా ? అన్నది క్లారిటీ లేదు. వంశీకే జగన్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక మరి టీడీపీ నుంచి ఎవరు ? పోటీ చేస్తారన్నది కూడా ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ వంశీని ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థే రంగంలో ఉండాలి.
జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థే అవుతాడు. అయితే గన్నవరం టీడీపీ వాళ్లలో చాలా మంది ఉమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అయితేనే కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు.
అయితే ఆర్థిక, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అనూరాధ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే బాబు లోకేష్‌నే పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లోకేష్ ఇప్పటికే మంగళగిరిలో ఓడిపోయి ఉన్నాడు. గన్నవరంలో కమ్మ వర్గం ఓటర్లు ఎక్కువ. పైగా పార్టీకి భవిష్యత్ లీడర్‌గాను… టీడీపీ సీఎం అభ్యర్థిగాను ఫోకస్ చేసేందుకు చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే గన్నవరంపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు ఇక్కడ నుంచి అవసరమైతే లోకేష్‌ను పోటీ చేయించి గెలిపించుకుని సత్తా చాటాలన్న ప్లాన్‌తో ఉన్నారట. అయితే మంగళగిరిలోనే గెలవని నారా లోకేష్ గన్నవరంలో గెలుస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. గన్నవరంలో కూడా లోకేష్ ఓడిపోతే అతడి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. మరి బాబు ఈ రిస్క్ చేస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.