రాజుగారు రెడీ అయ్యారండి..భలే సెట్ చేసుకుంటున్నారుగా!

-

గత రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకెళుతున్నారు. వైసీపీని ఎలాగైనా ఇరుకున పెట్టడానికి ఇంతకాలం ప్రయత్నిస్తూ వచ్చిన రఘురామ…తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ నరసాపురం బరిలో నిలబడి, వైసీపీకి చెక్ పెట్టడానికి కొత్త ఎత్తులు వేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజీనామా చేసి గెలవడం అనేది చాలా కష్టమైన పని.. కానీ తాను మాత్రం గెలుస్తానని రాజు గారు అంటున్నారు.

తాను గెలవడానికి అన్నిటిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక ఎంపీ పదవికి రాజీనామా చేయడం దాదాపు ఖాయమైందనే చెప్పొచ్చు. ఫిబ్రవరి 5 తర్వాత రాజుగారు రాజీనామాకు రెడీ అవుతున్నారని, ఇటీవల ఆయన మాట్లాడే మాటలు బట్టి అర్ధమవుతుంది. అలాగే ప్రతిపక్ష పార్టీల మద్ధతు తీసుకుని నెగ్గాలని చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ సపోర్ట్ ఉంటుందని రాజుగారు ధీమాతో ఉన్నారు. అందుకే పదవికి రాజీనామా చేసేస్తానని అంటున్నారు. ఇంకా రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకమైన విషయాలని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పి‌ఆర్‌సి విషయంలో ఉద్యమబాట పడుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఇచ్చిన పి‌ఆర్‌సి వల్ల జీతాలు తగ్గుతున్నాయే తప్ప..పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ రఘురామ ఢిల్లీలో ఉపవాస దీక్ష కూడా చేశారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మద్ధతుగా విద్యార్ధులు…సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.

ఇలా రాజు గారు ఉద్యోగులకు మద్ధతు తెలపడానికి కారణం…నరసాపురం ఉపఎన్నికే…ఎన్నికని నిర్వహించాల్సింది ఉద్యోగులే…పైగా తన పార్లమెంట్‌ పరిధిలో ఉద్యోగులని దగ్గర చేసుకునేందుకు రఘురామ ఇలా దీక్ష చేశారు. మొత్తానికి నరసాపురంలో గెలవడానికి రాజు గారు…ఇప్పటి నుంచే అన్నీ సెట్ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news