హైదరాబాద్: ‘మా’ ఎన్నికల వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. నిన్నటి వరకూ లోకల్, నాన్ లోకల్ వార్ నిడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు గతంలో ‘మా’అధ్యక్షులుగా ఉన్న వాళ్లు ఏం చేశారనే వాదన వినిపిస్తోంది. తాజాగా నటుడు నరేశ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘మా’ అధ్యక్షులుగా చిరంజీవి, నాగబాబు, మురళీమోహన్ పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ విమర్శలు కురిపించారు. గతంలో వీరంతా సినీ నటుల సంక్షేమానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు తాము చేసిన పనులను ప్రశ్నించే ముందు వాళ్లు ఏం చేశారో చెప్పాలని వ్యాఖ్యానించారు. శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు.
‘మా’లో విబేధాలు ఇప్పటివికావని నరేశ్ కొట్టిపారేశారు. గతంలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య విబేధాలు ఉన్న విషయాన్ని నరేశ్ గుర్తు చేశారు. ఇటీవల కాలంలో రాజశేఖర్, తన మధ్య కొందరు విబేధాలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఆలోచిస్తే దాని వెనక ఒక హిడెన్ ఎజెండా ఉందనిపిస్తోందని చెప్పారు. తనకు కొంత మందిని శత్రువులుగా తయారు చేశారని, వాళ్లు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ‘మా’ మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలు బాధించాయన్నారు. తాను ఎర్ర బస్సు ఎక్కిరాలేదన్నారు. తాను సినిమా పరిశ్రమలో పుట్టానని నరేశ్ పేర్కొన్నారు.
‘‘900 మంది మా సభ్యులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ సమయంలో నేను ఎందుకు మౌనంగా ఊరుకోవాలి. మేము చేసిన మంచి పనులను తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. చూస్తూ ఊరుకోవాలా?. ఈ హిడెన్ ఎజెండా వెనక ఎవరున్నారు? ‘మా’లో చిచ్చు రేపాలనుకుంటున్న బిగ్‌బాస్ ఎవరు?.’’ అని నరేశ్ ప్రశ్నించారు.