ప్రతీ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటారు. హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుతారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా ధ్యాన్ చంద్ రికార్డు నెలకొల్పాడు.
ఇటీవల ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్ళు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. కాకపోతే ఇంకా అనేక క్రీడల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం. ఇదిలా ఉంటే మహమ్మారి కారణంగా క్రీడలనేవి లేకుండా పోయాయి. విద్యార్థులకు పాఠశాలలు లేక ఆటలు కరువయ్యాయి.
బయటకెళ్తే మహమ్మారి భయం కాబట్టి ఇంట్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆటలు ఆడడం వల్ల శరీర వ్యాయామం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది.
ఈ మహమ్మారి సమయంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఫోన్లనే పట్టుకుంటున్నారు. ఆన్ లైన్ క్లాసుల పేరిట ఇది మరింత పెరిగింది. ఆన్ లైన్ క్లాసుల్లో ఎంత నేర్చుకుంటున్నారనేది పక్కన పెడితే ఎంతో కోల్పోతున్నారనేది తెలుస్తుంది.
బాల్యంలో పిల్లల జీవితం ఆటల్లోనే గడపాలి. అవే చిన్ననాటి జ్ఞాపకాలుగా మధురానుభూతులుగా మిగులుతాయి. ఆ అనుభూతి ప్రస్తుత తరం మిస్సవుతుంది. కరోనా కూడా దానికి ఒక కారణంగా నిలుస్తుంది.
మరి ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి?
నిజానికి పిల్లలకు ఆటలంటే ఇష్టమే. కానీ వాటిని పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి, ఇంట్లో కూర్చోపెడుతున్నారు. అలా కాకుండా రోజు ఉదయం, సాయంత్రం వాళ్ళతో మీరు కూడా ఆటలాడండి. మీ వీధిలో లేదా మీ అపార్ట్ మెంట్లో, మీకు తెలిసిన పిల్లలతో (కోవిడ్ నియమాలు పాటిస్తూ) ఆటలు ఆడించండి.
కొన్నిసార్లు శారీరక శ్రమ లేని చెస్ వంటి ఆటలు ఆడించండి. దానివల్ల మానసిక వికాసం కలుగుతుంది. జాతీయ క్రీడాదినోత్సవం రోజున ఈ విషయాలు పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది.