నీట్ పరీక్ష అంశంపై బీజేపీ నేత షాజియా ఇల్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ వివాదంపై రాజకీయ స్టంట్‌లు, పరస్పర విమర్శలు మాని చిత్తశుద్ధితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన అంశమని, నీట్ వివాదంతో లక్షలాది విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కలత చెందుతున్నారని చెప్పారు.
ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ బాధ్యులెవరూ వెనక్కిమళ్లడం లేదని పేర్కొన్నారు. నీట్ రగడపై చర్చించేందుకు తాము సిద్ధమని, సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని చక్కదిద్దేందుకు తాము ముందుకొస్తామని ఆమె తెలిపారు. నీట్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నీట్ అంశంపై తాము మౌనం దాల్చలేదని, చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. పట్నాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ మాదిరిగా తాము మాటలకే పరిమతం కాదని పేర్కొన్నారు. తాము మాటలకు పరిమితం కాకుండా కార్యాచరణ చేపడతామని చెప్పారు.