మిజోరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలింది. ఒక్కసారిగా క్వారీ కూలిన ఘటనలో పది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు ఐజ్వాల్‌లో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. పాఠశాలలను మూసివేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది.