భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌పదవి కోసం ఈ నెల బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీలు ఉన్నట్లు తెలిసింది. అందుకోసం కొందరు ఆకతాయిలు.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి పేర్లతో ఫేక్ దరఖాస్తులు పంపారు. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని జాతీయ మీడియా కథనం ఒకటి పేర్కొంది.
మరోవైపు కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. మరోసారి భారతీయుడే ఉంటాడా..? విదేశీ కోచ్‌వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో హెడ్ కోచ్ పదవికి ప్రకటన ఇస్తూ బీసీసీఐ ఒక గూగుల్ ఫామ్‌ను తన వెబ్‌సైట్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడానికి గడువు మే 27వ తేదీతో ముగిసింది.