లోక్సభ 2024 ఎన్నికలు.. దేశం దృష్టంతా ఈ పది మందిపైనే!

-

లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు తమ ప్రచార అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు మళ్లీ అధికారం దక్కించుకోవాలని తాపత్రయ పడుతుండగా మరికొన్ని పార్టీలు అధికారం కోసం శ్రమిస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో భారీగా ప్రభావం చూపే కొంత మంది నేతలపైనే ఇప్పుడు ప్రజల దృష్టంతా. అలా ప్రభావం చూపగల 10 మంది నాయకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నరేంద్ర మోదీ

పదేళ్ల కాలంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ దిల్లీలో మరోసారి గద్దెనెక్కాలని ఆశపడుతున్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కౌంటర్‌గా ‘మోదీ కీ గ్యారెంటీ’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ దేశమంతా మోదీ కుటుంబమని ఉద్ఘాటిస్తున్నారు. మూడో సారి అధికారం చేపడితే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చుదిద్దుతామని బహిరంగ సభలు, సదస్సులో చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

అమిత్ షా

ఎన్నికల సమయంలో వ్యూహాలు రచిస్తూ చాణక్యుడిగా పేరు గాంచిన అమిత్ షా.. తెరవెనక ఉండి వ్యూహాత్మక అడుగులు వేయడం సహా ప్రతిపక్షాలపై పదునైన వాగ్బాణాలను సంధిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన సైన్యాధిపతిగా వ్యవహరించే ఆయన. ఈ ఎన్నికల్లోనూ ఆ పాత్రనే పోషించనున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాహుల్ గాంధీ

కేంద్రంలో మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో ఇండియా కూటమిని ఏర్పరిచారు. అనంతరం క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని కూడగట్టేందుకు జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేపట్టారు. ఈసారైనా ఆయన ప్రధాని కావాలన్న కల నెరవేరుతుందా లేదో చూడాలంటే వేచి చూడాల్సిందే.

మల్లికార్జున ఖర్గే

పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ను ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు.

మమతా బెనర్జీ

బెంగాల్‌లో అంతకంతకు పెరుగుతున్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల, నిరుద్యోగం, కేంద్ర అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దీదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

నీతీశ్ కుమార్

ప్రతిపక్షాలు కూటమి కట్టడం వెనక కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీయే కూటమిలో చేరారు. నీతీశ్‌ యూటర్న్‌పై రానున్న ఎన్నికల్లో బిహార్‌ ప్రజలే తీర్పును చెప్పాల్సి ఉంది.

శరద్ పవార్

మహారాష్ట్ర రాజకీయాలలో సీనియర్‌ నేతగా, ఎన్సీపీని జాతీయ పార్టీగా మార్చిన శరద్‌ పవార్‌కు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి మహా వికాశ్‌ అఘాడీ రూపంలో గట్టి పోటీనే ఎదురుకానుంది. పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్‌ పవార్‌ వర్గానికే కేటాయించడంతో ఇప్పుడు శరద్‌ పవార్‌ కొత్త గుర్తును, పేరును ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలి.

స్టాలిన్

డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లోక్సభ ఎన్నికల్లో జోరును సాగించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే సనాతన ధర్మంపై స్టాలిన్‌ కుమారుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారాయి.

తేజస్వీ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వీ యాదవ్‌కు క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకొని తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

అసదుద్దీన్ ఓవైసీ

ఏఐఎంఐఎం అధినేత అసద్దుదీన్‌ ఓవైసీ, పలు రాష్టాల లోక్‌సభ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news