పశ్చిమ బెంగాల్‌ను భారీ వర్షాలు వణికించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా మాల్డా జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ జిల్లాలో పిడుగుపాటుకు గురై ఏకంగా 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానకు తరలించారు. వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
బాధితులంతా పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడటంతో మరణించారని అధికారులు తెలిపారు. కాగా, పిడుగుపాటుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన దీదీ.. ఒక్కొక్కొరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాఅని అధికారులను ఆదేశించారు. మరోవైపు అకాల వర్షాలతో బెంగాల్ లోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇక తెలంగాణలోనూ గురువారం రోజున భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారు. మరోవైపు హైదరాబాద్ లో వాన బీభత్సం సృష్టించింది.